తమిళనాడు కోసమే మేకెదాటు ప్రాజెక్ట్‌.. 95 శాతం నీళ్లు వాళ్లకే: డికే శివకుమార్

తమిళనాడు కోసమే మేకెదాటు ప్రాజెక్ట్‌.. 95 శాతం నీళ్లు వాళ్లకే: డికే శివకుమార్

బెంగళూరు: ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వల్ల కర్ణాటక కంటే పొరుగున ఉన్న తమిళనాడుకే అత్యంత ప్రయోజనకరమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మహాబలిపురంలో జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తాను ఈ విషయాన్ని తమిళనాడు సీఎం విజయ్ తో  ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు. ఇండియా టుడే రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్న ఆయన  మీడియాతో మాట్లాడారు.

మేకెదాటు ప్రాజెక్ట్‌లో నిల్వ చేసే నీటిలో సుమారు 95 శాతం వాటా తమిళనాడుకే దక్కుతుందని శివకుమార్ వాదించారు. భారీ వర్షాకాలంలో సముద్రంలోకి వ్యర్థంగా వృథాగా పోయే అదనపు కావేరీ నీటిని నిల్వ చేయడానికి ఈ ప్రాజెక్ట్ తమిళనాడుకు ఒక ప్రాణరక్షకం లాంటిదని అన్నారు.బెంగళూరు, పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కేవలం 10 టీఎంసీల నీటిని మాత్రమే (4.75 టీఎంసీలు తాగునీరు) తీసుకుంటామని, అలాగే 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

 సాధారణ సంవత్సరంలో తమిళనాడుకు విడుదల చేయాల్సిన 177.25 టీఎంసీల కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశారు.  సుదీర్ఘ న్యాయ పోరాటాల కంటే ముఖాముఖి చర్చల ద్వారానే అంతర్రాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని శివకుమార్ అభిప్రాయపడ్డారు. తుంగభద్ర నదీ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి చర్చలు జరిపినట్లు ఆయన గుర్తుచేశారు.

ALSO READ : సిటీ మునుగుతుందా.. 2047 వరకు ఆగండి.. 

తుంగభద్ర వ్యవస్థలో నష్టపోతున్న 30-33 టీఎంసీల నీటి సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రైతులకు అండగా నిలవడం, రాష్ట్రంలోని సాగు భూమిని మరింత అభివృద్ధి చేయడమే కర్ణాటక ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని  డీకే శివకుమార్ చెప్పారు.